Friday 3 September 2021

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

 ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా !

కొన్ని కొన్ని సినిమాలు కథాపరంగా చాల సాదా సీదాగా మొదలవుతాయి. దాదాపు సగం సినిమా అయ్యేదాకా కూడా ఈ కథలో కొత్తదనం ఏముంది అనుకుంటాం. కాని ఇంటర్వల్ వచ్చేసరికి సడన్ గా కథ ట్విస్ట్ తీసుకునేసరికి మనం ఉలిక్కిపడి ఈ కథలో ఏదో కొత్తదనం ఉందని అలర్ట్ అవుతాము. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుంది.

Abhiyum Anuvum Explained in Telugu


అభి అని పిలవబడే అభిమన్యు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. ఊటీలో ఆర్గానిక్ కూరగాయలు పండించి అమ్మే అను అనే అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోని ఒక రోజు అభి చూస్తాడు. ఆ వీడియో అతనికి నచ్చి, ఆమె పోస్ట్ చేసిన ఇతర వీడియోలు కూడా చూస్తాడు. ఆమెలోని చలాకీతనం, సేవా కార్యక్రమాలు చూసి, ఆమె పట్ల అతను ఆకర్షితుడై ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు. కాని ఆమె రిజెక్ట్ చేస్తుంది. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి ఆమెతో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయించుకుంటాడు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకసారి అభి ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆమె ఏమీ అనకుండా ఫోన్ కట్ చేస్తుంది. అతను, తన ప్రేమను ఆమె రిజెక్ట్ చేసిందా అన్న అనుమానంతో ఊటీ వెళ్లి ఆమెని కలిసి అడుగుతాడు, ఫోన్ ఎందుకు కట్ చేసావని. అందుకామె నవ్వుతూ నువ్వు ప్రొపోజ్ చేసేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎలావుంటుందో చూడాలని అని చెప్పి, అతని ప్రేమని అంగీకరిస్తుంది. కాని ఒక కండిషన్ పెడుతుంది, రేపే పెళ్లి చేసుకోవాలని. అతను ఒప్పుకుంటాడు. అనుకున్నట్టుగానే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే వారి పెళ్లి జరిగిపోతుంది.
ఆ తరువాత, వాళ్ళు చెన్నై లోని వాళ్ళ ఫ్లాట్ కి వస్తారు. అదే అపార్ట్మెంట్స్ లో వుండే, అభిని కొడుకులా అభిమానించే రేవతి వారికి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం చెబుతుంది. వారి పెళ్లి విషయం అభి తల్లిదండ్రులకు, అను తల్లి మీనాకు తెలిసి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. కొన్ని నెలలు గడుస్తాయి. అను ప్రెగ్నెంట్ అవుతుంది. కూతురిని చూసుకోవడానికి మీనా వచ్చి వారితో పాటే ఉంటుంది. ఇంతవరకూ ఇది మామూలు ప్రేమ కథే ! ఇందులో స్పెషాలిటీ ఏముంది అనుకుంటాం! కాని, కథలో ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది !
మీనా తన కూతురు అనును చూసుకోవడాని వచ్చి వారితోనే వుంటోందన్న విషయం చెప్పుకున్నాం కదా. అభి తల్లి కోడలిని చూసుకోవడానికి ఒక నడివయస్కురాలిని వారి వద్దకు పంపిస్తుంది. ఆమె వచ్చి మీనాని చూసి గుర్తు పట్టి, కంగారుతో అభి తలిదండ్రులకు ఫోన్ చేస్తుంది. వాళ్ళు అదరబాదరగా దొరికిన ఫ్లైట్ లో చెన్నై వచ్చి అభి ఇంటికి వస్తారు
ఇక్కడే మనకు ప్రశ్నల వర్షం మొదలవుతుంది. అసలు మీనాని చూసి ఆ మధ్యవయస్కురాలు ఎందుకు అంత కంగారు పడింది? అసలు మీనా ఎవరు? ఆమె పేరు చెప్పగానే అభి తలిదండ్రులు ఎందుకంత షాక్ అయ్యారు? ఈ ఉదంతం అభి, అనుల కాపురంలో ఏమైనా డిస్ట్రబెన్స్ కలిగిస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబే మెయిన్ ట్విస్ట్ కాబట్టి వీటికి సమాధానం చెప్పనని మీకు తెలుసు కదా !
ఈ ట్విస్ట్ చాల సున్నితమైన అంశం. ఇలాంటి అంశాన్ని బ్యాలన్సుడ్ గా తెర మీదకు ఎక్కించడం అంత సులువు కాదు. దర్శకురాలు బి. ఆర్ . విజయ లక్ష్మి చాల విజయవంతంగా ఆ ప్రయత్నం చేసారు. అందుకు ఆమెను మనం అభినందించాలి. ఇంతకీ విజయ లక్ష్మి ఎవరో కాదు, ఒక నాటి ప్రఖ్యాత కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన బి ఆర్ పంతులు కూతురు. స్వతహాగా ఆమె సినిమాటోగ్రాఫర్. దాదాపు 22 సినిమాలకు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే అభిగా టోవినో థామస్, అనుగా పియా బాజ్పాయి, రేవతి గా సుహాసిని, ఆమె భర్తగా ప్రభు, మీనాగా రోహిణి అద్భుతంగా నటించారు. పాటలు మెలోడియస్ గా వున్నాయి. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేస్తాయి.
తప్పకుండ చూడాల్సిన సినిమా. అమెజాన్ ప్రైమ్ లో వుంది
చిత్ర పరిచయం: రాంకుమార్ భారతం

Tuesday 31 August 2021

Pushpa Movie Villain: Fahadh Faasil

Pushpa Movie Villain: Fahadh Faasil

విలన్ అంటే భారీ కాయం గుబురు మీసాలు భీతావహమైన రూపం, ఖంగుమనే స్వరం ఉండాలన్న రూల్ ని శివ సినిమాతో రఘువరన్ ని విలన్ గా పరిచయం చేయడం ద్వారా రామ్ గోపాల్ వర్మ బ్రేక్ చేసాడు. అప్పటినుంచి కొత్త తరహా విలన్లు వస్తూనే ఉన్నారు. విలన్లగా నటించి హీరోలుగా చేసిన వాళ్ళున్నారు. హీరోలుగా నటించి విలన్లగా అవతారం ఎత్తిన వాళ్ళూ ఉన్నారు. కానీ ఒకపక్క హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సంపూర్ణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఫహాద్ విలనిజం గురించే కాస్త ఎక్కువ మాట్లాడుకోవచ్చు.

Pushpa Movie Villain: Fahadh Faasil


ఏమాత్రం ఒడ్డు పొడుగు లేని పొట్టిగా ఉండే సన్నని రూపం దానికి తోడు కాస్త బట్టతల ఇవేమీ నటుడిగా విజయవంతం కావడాన్ని ఫహాద్ ని ఆపలేక పోయాయి. పరిపూర్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మదిలో తనదైన ముద్రను వేసాడు ఫాహాద్. చిన్ని చిన్ని పాత్రలను పోషించడానికి కూడా ఫహాద్ ఏమాత్రం వెనుకాడదు. మంచి ఫార్మ్ లో ఉన్న హీరోగా మళయాళంలో తనకున్న క్రేజ్ & మార్కెట్ కి చిన్న చిన్న పాత్రలు చేయడానికి ముందుకు రావడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు.
చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్ గా కూడా మెప్పించడం తనకే చెల్లింది. వేసింది చిన్న పాత్రైనా సరే తనదైన ముద్ర వేసి ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేస్తాడు. కుంబలింగి నైట్స్ అనే మలయాళ మూవీలో షమ్మీ శ్రీనివాసన్ అనే చిన్న పాత్రలో ఫాహాద్ విశ్వరూపం చూడొచ్చు. చూపులతోనే భయపెడుతూ మాటలో ఒకలా చేతలు మరోలా ఉండే బార్బర్ గా ఫహాద్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. సూపర్ డీలక్స్ అనే మూవీలో భార్య కోసం శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నం చేసే భర్తగా, వేలైక్కారన్ లో విలన్ గా జోజి మూవీలో తండ్రినే హతమార్చిన కొడుకుగా, ట్రాన్స్ లో పరకాయ ప్రవేశం చేసిన పాస్టర్ గా మాలిక్ లో ఒక ప్రాంతాన్ని శాసించే డాన్ గా వేసిన ప్రతీ పాత్రలో జీవిస్తున్న ఫాహాద్ ని పుష్పలో విలన్ గా తీసుకోవడం ద్వారా ఆ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. పుష్పకి ధీటుగా సవాల్ విసిరే భన్వర్ సింగ్ పాత్రలో ఫాహాద్ రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే భీతావహమైన రూపంతో కనిపిస్తున్న ఈ విలక్షణ నటుడు పుష్పకి ప్రధాన ప్రత్యర్థిగా మాత్రమే కాక పుష్పకి ఆయువు పట్టుగా మారి నటిస్తాడని ఆశిద్దాం..
PS- ఏదో రాయాలని మొదలుపెట్టి ఏదేదో రాసేసాను..

Sridevi Soda Center Full Movie Explained in Telugu

"శ్రీదేవి సోడా సెంటర్" సినిమా చూశాను. నిజం చెప్పాలంటే సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కామన్ గా అనిపించింది. ఈ రోజు సినిమా చూస్తే ఎక్కడా కామన్ గా కనిపించ లేదు. జాతరకు వెళ్ళినట్లు సరదా సరదాగా ఫస్టాఫ్ అయిపోయింది. ‘అప్పుడే’ అని టైం చూస్తే ఇంటర్వల్ టైం అయింది.

Bigg Bigg Non-Stop is an unofficial Bigg boss voting poll website. You should definitely checkout.

బయటకు వచ్చి కాఫీ తాగుతూ "భలే తీశారే, టైంమే తెలియలేదు’’ అని నాలో నేనే మురిసిపోతున్నాను. ఆ ఆనందంలో "ఫస్టాఫ్ సూపర్" అని కొందరికి మెసేజ్లు కూడా పెట్టాను.

Read the New Telugu Movies on OTT 2022-2023

Sridevi Soda Center Review and Explained in Telugu


లోపలికి వచ్చాను.
సినిమా మొదలైంది. ఫ్లాట్ పాయింట్ టూ ఆశ్చర్యానికి గురిచేస్తూ నన్ను లాక్ చేసింది.! దానితో పాత్రలు హాయిగా స్క్రీన్ మీద నవ్వుతూ పాటలు పాడుకుంటున్నాయి కానీ నాలో తెలియని ఆందోళన మొదలైంది.! పాట తర్వాత ఏమవుతుంది?, ఏమవుతుంది అనే ఆలోచనలు నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. అనుకున్నంతా అయ్యింది.! సూరి బాబు మీద కోపం వచ్చింది. "ఓరి నీ ప్రేమ చల్లగుండ ఎంత పని చేసావ్రా సూరి బాబూ" అనుకున్నాను. తర్వాత వన్ బై వన్ రివీల్ చేసుకుంటూ క్లైమాక్స్కు వెళ్లిన విధానం సీట్ ఎడ్జ్ న కుర్చోబెట్టింది.! సినిమా అయిపోయింది.! కానీ నేను మాత్రం కూర్చున్న సీట్లోనే ఉన్నాను. గుండె బరువెక్కింది. జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకుని బయటకు వస్తుంటే అందరూ డల్గానే ఉన్నారు. నాతో పాటు చాలా మంది కనెక్ట్ అయ్యారన్నమాట అనుకున్నాను. క్లైమాక్స్ మాత్రం తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకూ రానిదని మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. మరోసారి గట్టిగా తెలుగు సినిమా ప్రేమికులు తలుచుకునే పేరు 'కరుణ కుమార్' తెలుగు సినిమాకి ఓ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ దొరికారేమో కరుణ కుమార్ రూపంలో అనిపిస్తుంది.


కాశీ నాగేంద్ర రాసిన కథ మట్టిలో గీసుకున్న కుల గీతల్ని చాలా సహజంగా పట్టుకుంది. ఇక ఎండ్లూరి సూరిబాబు (సుధీర్ బాబు) పర్ఫామెన్స్ చాలా కొత్తగా ఉంటూ గోదావరి కుర్రాడ్ని అచ్చుగుద్దినట్లు తన నటనలో దింపేశాడు. సుధీర్ బాబు నుండి ఈ లైటింగ్ సూరిబాబును బయటకు లాగిన ఘనత కరుణ కుమార్ కే దక్కుతుంది. ఎందుకంటే ఇంత కొత్తగా సుధీర్ బాబు ఇప్పటి వరకూ మనం చూడలేదు. శ్రీదేవిగా (ఆనంది) నటన చాలా సహజంగా పక్కింటి అమ్మాయిలా అనిపించింది. అలాగే పెద్ద నరేష్ గారి నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. విలన్ గా కాశీ, సత్యం రాజేష్, రఘుబాబు, కత్తి మహేష్ ఇలా అందరి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రొడ్యూసర్స్ విజయ్, శశి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్ గా క్వాలిటీగా సినిమాను నిర్మించారు. భవిష్యత్తులో వీళ్ళ దగ్గర నుంచి మరిన్ని ఇలాంటి ఆలోచింపజేసే సినిమాలు రావాలని కోరుకుందాం. మణిశర్మగారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా వినిపించింది. కెమెరా, ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయి. "గొప్ప సినిమాకి ఉండే క్వాలిటీ ఏమిటి" అని ఒక సినీ పండితుడ్ని అడిగితే "సింపుల్ సిటీ" అని సమాధానం ఇచ్చాడు. ఆ క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. దానికి మంచి ఉదాహరణ ‘ఎండ్లూరి’ అనే ఇంటి పేరు వాడి ఎన్నో చెప్పకుండానే చెప్పారు. అది స్క్రీన్ మీదే చూడండి. తప్పకుండా థియేటర్స్ కు వెళ్ళి సుగంథి సోడా లాంటి సుధీర్, లెమన్ లాంటి ఆనంది పర్ఫామెన్సుల్ని దింపకుండా గోలి గొంతులోకి పోకుండా తాగేయండి.!
Read: OTT List

Dia Full Movie in Telugu Explained

Dia Telugu dubbed Movie Review in Telugu and Explained

కొన్ని సినిమాల వల్ల నేను పొందిన కొన్ని అనుభూతులు మీతో పంచుకోవాలి అనిపించింది.

dia telugu dubbed movie review
అడ్మిన్ గారు అప్రూవ్ చేస్తారనే నమ్మకంతో.....

అప్పట్లో అందరూ దీని గురించే మాట్లాడుతుండేవారు....
స్టేటస్లు రీల్స్ అన్నీ ఈ మూవీ వే ఉండేవి...
అంత బాగుంటుందా ...ఎలాగైనా చూడాలి అనుకున్నాను.
ఫైనల్లీ వన్ ఫైన్ డే మొదలు పెట్టా..
అదే దియా మూవీ.
మన భాష కాదాయే...సినిమా చూడాలో subtitles చదువుతూ పోవాలో తెలీని పరిస్థితి.
సినిమాల్లో ఎన్నో రకాలు ఉండవచ్చు...
కానీ ప్రేమ కథలకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది...
ఆ స్థానం వేరే ఏ జోనర్ సినిమా తీసుకోలేనిది.
ఫస్ట్ నాకు దియా వాయిస్ నచ్చింది ...
ఇప్పటికీ నాకు ఆ గొంతు గుర్తుంది...
తర్వాత ఆమె కళ్ళు....షాక్ అయినప్పుడల్లా పెద్దగా అవుతాయి....
ఒక్కొక్క సీన్ ఎంత సున్నితంగా తెరకెక్కించారో కదా....దాదాపు మీలో అందరూ చూసే ఉంటారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేవరకూ నాకు అమ్మాయిలు కూడా ఫస్ట్ ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటారని తెలీదు...
ఏమో...
లవ్ అంటే ఫస్ట్ అబ్బాయిలే చెయ్యాలి...
అమ్మాయిలు చెయ్యడం పాపం..
వాళ్ళు ప్రపోజ్ చెయ్యాలి...తర్వాత ఇష్టం లేకపోతే అమ్మాయి రిజెక్ట్ చెయ్యాలి....
ఇష్టం ఉంటే కొన్ని రోజులు ఆగి ఓకే చెప్పాలి...ఈ ప్రాసెస్ నే నిజం అనుకున్నాను...
బయట ఎవరితో డిస్కస్ చేయము...చూసేది సినిమాల్లోనే...
ప్రతీ సినిమాలో హీరో నే హీరోయిన్ వెంట తిరుగుతాడు..
అదే వాస్తవం అలాగే ఉండాలేమో అనుకున్నాను...
సినిమాల ప్రభావం చాలా ఉంటుంది...జనాల మీద...అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు అమ్మాయిల వైపు నుండి వస్తుంటాయి...ఇలాంటి సినిమాలు చూసినప్పుడు హోహ్...అమ్మాయిలు కూడా ఫస్ట్ ప్రేమించొచ్చు అని తెలిసింది...
చాలా తక్కువ ఉంటాయి....చాలా అంటే చాలా తక్కువ.
వాటిలో నేను చూసినవి ప్రియమైన నీకు,దియా,కమలి ఫ్రమ్ నడుక్కవేరి, హే జవానీ హై దీవానీ,కుచ్ కుచ్ కుచ్ హోతా హై అంతే....కేవలం 5 సినిమాలు.
చాలా సార్లు డౌట్ వస్తుంది...
సినిమా వాళ్ళని సినిమా కథలను చూసి..
హార్మోన్స్ మగవారికేనా ఆడవారికి ఉండవా అని...ఈ సినిమాల వల్ల అసలు ప్రేమంటే అర్థమే తెలియనంతగా కన్ఫ్యూజ్ అయ్యాను...
కనీసం భవిష్యత్తులో అయినా సహజంగా జరిగేటట్లు ఆడవారి మనోభావాలకు అద్దం పట్టేటట్టు మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.
ఇంతవరకూ నేను చెప్పాలి అనుకున్నది కాకుండా వేరేదో చెప్పేశాను....
ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను.
దియా మొదటి సారి కన్నడలో చూసినప్పుడు అర్థం కాకపోయినా సరే ఆ భాష చాలా అందంగా అనిపించింది...
కారణం ఆ గొంతు...
దియా కి బాగా సెట్ అయింది.
అది తెలుగులో యూట్యూబ్లో అప్లోడ్ అయ్యిందని తెలిసి మళ్ళీ చూసాను...
అదే కథ అదే నటన అదే నటీనటులు....అయినా ఎందుకో మొదటి సారి పొందినంత భావోద్వేగం ఈసారి పొందలేదు.
తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది అయినా నాకు నచ్చలేదు...కారణం ఆ కన్నడ voice నేనింకా మర్చిపోలేదు...
పోయినసారి subtitles చదువుతూ bgm ఎంజాయ్ చెయ్యలేక పోయాను....ఈసారి భాష ప్రాబ్లెమ్ కాలేదు...సో bgms బాగా ఎంజాయ్ చేశాను.
ఏదైతే మనం మొదటి సారి ఏది చూసామో అదే మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది....
మనం రెండవసారి చూసినా మొదటిసారి పొందిన ఫీలింగ్ పొందలేము....
చాలా మంది తెలుగు vs తమిళ్ / తెలుగు vs మలయాళం/ or ఏవో రెండు భాషలలో రీ మేక్ ఐన సినిమాలను పోలుస్తూ ఉంటారు.....
మొదట తమిళ్ లో వచ్చింది చూసినవాళ్లు తెలుగు బాలేదు అంటారు....
మొదట తెలుగులో వచ్చింది చూసినవాళ్లు తమిళ్ ది బాలేదు అంటారు ..
ఏదీ మొదట చూసామో అదే మనమీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది....
నేను మొదట మారా చూసాను అందుకేనేమో నాకు చార్లీ పెద్దగా ఏమీ అనిపించలేదు...
మారా మస్త్ నచ్చింది.
ఫస్ట్ తెలుగు ప్రేమం చూశాను.....
తర్వాత మలయాళం ది చూశా...IDK నాకు తెలుగు ప్రేమం ఎక్కువ ఇష్టం.
ఇలా చాలా ఉంటాయి....
ఎప్పుడూ చూసే ఓకే రోత సినిమాలు కాకుండా...
పెద్ద పెద్ద బిల్డింగ్స్ ,యాభై కార్లు,కాస్ట్లీ డ్రెస్సులు ఉన్న సినిమాలు కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉన్న కాస్ట్లి కథలను చూడాలని ఉంది.

సత్యమే శివం (తెలుగు); అంబే శివం (తమిళం) LOVE IS GOD

 2003 లో విడుదలైన  ఈ సినిమా స్క్రీన్ ప్లే కమల్ హాసన్; దర్శకత్వం  c. సుందర్ పై చూస్తె ఈ సినిమా ఒక ప్రేమ కథో, లేక ఉన్నవారికి లేనివారికి జరిగే ఘర్షణ లాగానో కనబడుతుంది. కాని అసలు కథ ఆస్తికత్వం, నాస్తికత్వం,  కమ్యునిజం కంటే అన్ని ఇజాల కంటే  మానవత్వం  గొప్పది అని  చూపించారు. అనుక్షణం దేవుణ్ణి స్మరిస్తూ వేష, భాషల్లో ఆస్తికునిగా నటించే నాజర్ మానవత్వాన్ని మంట కలిపి రాక్షసుడుగా ఎం చేశాడో చక్కగా చూపించారు. స్తూలంగా కథ: కమల్ హసన్ ఒక కమ్యునిస్ట్ కార్యకర్త, అతన్ని  నాజర్ కూతురు బాల  ప్రేమిస్తుంది, సహజంగానే నాజర్ ఒప్పుకోడు. కమల్ , బాలలు పారిపోయి పేల్లిచేసుకున్దమనుకుంటారు.  కాని పెళ్ళికి పోయే దారిలో కమల్ బస్సుకు ప్రమాదం అయి తీవ్రంగా గాయపడతడు. దాదాపు చావు తప్పించుకొని అంగ వైకల్యంతో, మొహం వికారంగా అయి బతికి బయట పడతాడు . నాజర్ కమల్ చనిపోయాడని బాలకు అబద్దం చెప్పి,  యాడ్ డిరెక్టర్ మాధవన్ తో పెళ్లి నిశ్చయం చేస్తాడు.

sathyame sivam movie telugu


ఒకానొక విచిత్ర పరిస్తితులలో కమల్, మాధవన్ భువనేశ్వర్ నుండి చెన్నై కు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మొదట్లో కమల్ ను అసహ్యించుకున్నా, తరువాత కమల్ మంచితనం చూసి తన అన్నగా భావిస్తాడు, తన పెళ్ళికి ఆహ్వానిస్తాడు. తీరా పెళ్ళికి పోయాక మాధవన్ చేసుకోబోయే పెళ్లి కూతురు బాల అని తెలుస్తుంది. పెళ్ళిలో కమల్ ను చూసి నాజర్  కాళ్ళ బేరానికి వస్తాడు. ఈ పరిస్తితిని తోటి కార్మికులకు లాభం కలిగే విధంగా మలుచుకొని, మాధవన్ కు ఒక ఉత్తరం రాసి బయటకు వెళతాడు. కాని నాజర్ తన అసిస్టెంట్ సంతాన భారతి ని (గుణ దర్శకుడు) కమల్ ను చంపమని పంపుతాడు. కానీ కమల్ మంచితనం చూసిన సంతానం కమల్ ని క్షమించమని వేడుకుంటాడు.  అతనితో కమల్ చెప్పే ఆఖరి డైలాగ్ ఈ సినిమా  ఎసెన్స్ అనుకోవచ్చు. " నన్ను చంపడానికి వచ్చి, చంప గలిగి ఉండి  కూడా  క్షమించమని వేడుకున్నావే అది నీలోని మానవత్వం అదే దైవత్వం, నీవు కూడా దేవుడివే, దేవుడు ఎక్కడో ఉండడు మనుషుల్లోనే ఉంటాడు, సాటి మనుషులను ప్రేమించే వాళ్ళందరూ దేవుళ్ళే" అని అంటాడు కమల్.

Read: Doctor Movie Download Isaimini Moviesda

Aanum Pennum Movie Review in Telugu and Explained

మలయాళంలో వచ్చిన 'ఆనుమ్ పెన్నుమ్' చూశాను. చాలా మంది ఈ సినిమా రాసిన దాని ప్రకారం మూడు కథల్లో ముగ్గురు స్త్రీల గురించి తీసిన సినిమా ఇది. నేను అర్థం చేసుకున్నంతమేర ఇందులోని అంశాలు కొంత భిన్నంగా ఉన్నాయి. అవే మీ ముందు పెడతా!

Aanum Pennum Movie Review in Telugu and Explained


* రాణి
సినిమాలో ఇది చివరి కథ. రచయిత, దర్శకుడు ఉన్ని.ఆర్ రాసిన 'పెన్నుం చెరుక్కునం' కథ ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్. చాలా మంది ఈ భాగాన్ని విపరీతంగా పొగుడుతూ, దీన్ని చూసేందుకైనా తప్పకుండా సినిమా చూడాల్సిందేనని రాశారు. పురుషుడితో పోలిస్తే స్త్రీ ధైర్యవంతురాలు అన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ కావడం కారణమై ఉండొచ్చు. అయితే కథగా చూస్తే నన్ను అంతగా ఎక్సైట్ చేయని మాట మాత్రం వాస్తవం(కథ ఇక్కడ చెప్పబోవడం లేదు).
ఇద్దరు ప్రేమికులు ఏకాంతం కోసం ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లిన సమయంలో జరిగిన విషయాలే కథ. అయితే వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తిగా అనిపిస్తాయి. ప్రేమ అంటే పంచభూతాలు, విశ్వ విజేత.. అంటూ కబుర్లు చెప్పే ప్రేమికుడు సామాజిక భయానికి ఎంతగా తలవంచుతాడో, ఎంతగా గిలగిలలాడతాడో చూపించిన తీరు బాగుంది. అదే సమయంలో స్త్రీ స్వేచ్ఛగా, ధైర్యంగా తనకేం కావాలో, ప్రియుడి నుంచి ఏం కోరుతుందో అడిగి మరీ చూపించడం బాగుంది. ఈ కథలో అమ్మాయి పాత్ర రెబెల్‌గా ప్రవర్తించినట్టు కనిపిస్తున్నా, చాలా Practicalగా(తనేంటి, తనకేం కావాలి) బిహేవ్ చేసినట్టు నాకనిపించింది. ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానమైనా, ఒక భిన్న పరిణామాన్ని ఆమె తీసుకున్నంత ధైర్యంగా అతను తీసుకోలేడన్న విషయాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.
* సావిత్రి
రచయిత సంతోష్ ఎచిక్కనమ్ రాసిన కథ ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఆయనే దీనికి దర్శకుడు. 50 ఏళ్ల సంతోష్ మలయాళంలో ప్రసిద్ధ రచయిత. 2008లో 'కోమల' అనే కథ రాసి కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయితలు దర్శకులుగా మారినప్పుడు ఎంత Sensible కథలు తెరపైకి వస్తాయో చెప్పేందుకు ఈ చిత్రం తాజా ఉదాహరణ. కమ్యూనిస్టు, నక్సలైట్‌, మావోయిస్టులకూ తేడా తెలియనితనంతో మనం ఉంటే, కేరళవాళ్లు తమ చరిత్రలోని Communism అంశాన్ని తీసుకుని కథ రాసి, సినిమా తీశారు.
ఉద్యమాల్లో ఉండే స్త్రీల తెగింపు, తెగువ, ధైర్యం గురించి ఈ కథ ప్రస్తావిస్తూ సాగుతుంది‌. ప్రమాదకర సమయాల్లో తనను తాను రక్షించుకుంటూ సాగుతున్న మహిళ నేపథ్యం ఈ కథలో కీలకాంశం. కామ్రేడ్ సావిత్రి పాత్రలో నటి సంయుక్త మీనన్ నటన చాలా బాగుంది. ఏ స్త్రీకైనా బతుకుంతా పురుషులతో చేయాల్సింది పోరాటమే అన్నట్టు కథ ముగించడం బాగుంది. ఎటొచ్చీ కమ్యూనిస్టు స్త్రీ కార్యకర్త తన రహస్యం బయటకు తెలియకుండా ఉండేందుకు, తన శరీరాన్ని మరో వ్యక్తికి పంచడం అన్నది కొంచెం మింగుడు పడలేదు. అంత నిస్సహాయత వెనకాలున్న కారణం పేలవంగా మిగిలింది. జరిగిన సంఘటన ఆధారంగా రాసిన కథ అని ముందుగానే చెప్పడం వల్ల ఎటువంటి అభ్యంతరం చెప్పలేం!
* రాచియమ్మ
మూడు కథల్లో నాకు చాలా నచ్చిన కథ ఇది. ఇలాంటి అంశం కథవడం బాగుంది. స్త్రీ పురుషుడిపైన ప్రేమ చూపించడాన్ని పురుషుడు ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ప్రతిఫలంగా ఆమెకు ఏమివ్వాలి? ఈ రెండు అంశాలే ఈ కథ. ఏమీ ఇవ్వలేనంత నిస్సహాయతే అతని సమాధానం అని చెప్పకనే చెప్పడం ఈ కథ ముగింపు. మలయాళ తొలి సాహితీకారుల్లో ఒకరైన పరుతొల్లి చలప్పురత్తు కుట్టి కృష్ణన్(కలం పేరు 'ఉరూబ్') రాసిన 'రాచియమ్మ' కథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. 1969లో రాసిన కథలో స్త్రీ పాత్రను ఇంత అద్భుతంగా రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

స్త్రీ ఎవరి మీద ఏ క్షణాన ఎందుకు ప్రేమ చూపుతుందో ఆమె మనసుకు తెలుసు. దాన్ని అర్థం చేసుకుని ఆమెకు తోడుగా నిలిచే పురుషుడే ఆమెకు ముఖ్యం. అలా కాకుండా, తనకున్న భయాలు, ఇబ్బందులతో వెళ్లిపోయే పురుషుడి కోసం ఆమె దుఃఖించదు. తాపీగా తన బతుకు తాను బతుకుతుంది. ఏదో ఒకరోజు అతనే తిరిగి వస్తాడని ధైర్యం చెప్పుకుంటుంది. ఇది జగమెరగాల్సిన సత్యం. కొండంత ఆమె ప్రేమ, ధైర్యాలకు పురుషుడు ఏమివ్వగలడు? ఏం అందివ్వగలడు? వాహ్! ఇదీ కథంటే! నటీనటులు పార్వతి, ఆసిఫ్ అలీ చాలా సహజంగా నటించారు. కథ ప్రకారం (రాచియమ్మ మైసూర్‌‌వాసి కాబట్టి) మలయాళం సంభాషణలను ఒత్తొత్తి నిదానంగా పలికారు పార్వతి. అలా వినడం చాలా బాగుంది.
పీఎస్: మూడు కథలూ చూశాక నాకో విషయం అర్థమైంది. మరి ఎవరైనా గమనించారో, లేదో తెలియదు. 'రాణి' కథకు క్రైస్తవ పురాణాల్లోని 'Adam & Eve' కథతో పోలికుంది. 'సావిత్రి' కథ విరాటపర్వంలోని 'కీచకవధ'లా అనిపిస్తుంది. 'రాచియమ్మ' కథ శకుంతల, దుష్యంతుల కథలా తోస్తుంది. దర్శకులు కావాలనే ఇలా పురాణ కథల్ని పోలిన కథలు తీసుకున్నారా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా తెలియదు. Read: Tamil Movie Auditions
(సినిమా Amazon Primeలో లభ్యం)

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

  ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా ! కొన్ని...