Tuesday 31 August 2021

Aanum Pennum Movie Review in Telugu and Explained

మలయాళంలో వచ్చిన 'ఆనుమ్ పెన్నుమ్' చూశాను. చాలా మంది ఈ సినిమా రాసిన దాని ప్రకారం మూడు కథల్లో ముగ్గురు స్త్రీల గురించి తీసిన సినిమా ఇది. నేను అర్థం చేసుకున్నంతమేర ఇందులోని అంశాలు కొంత భిన్నంగా ఉన్నాయి. అవే మీ ముందు పెడతా!

Aanum Pennum Movie Review in Telugu and Explained


* రాణి
సినిమాలో ఇది చివరి కథ. రచయిత, దర్శకుడు ఉన్ని.ఆర్ రాసిన 'పెన్నుం చెరుక్కునం' కథ ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్. చాలా మంది ఈ భాగాన్ని విపరీతంగా పొగుడుతూ, దీన్ని చూసేందుకైనా తప్పకుండా సినిమా చూడాల్సిందేనని రాశారు. పురుషుడితో పోలిస్తే స్త్రీ ధైర్యవంతురాలు అన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ కావడం కారణమై ఉండొచ్చు. అయితే కథగా చూస్తే నన్ను అంతగా ఎక్సైట్ చేయని మాట మాత్రం వాస్తవం(కథ ఇక్కడ చెప్పబోవడం లేదు).
ఇద్దరు ప్రేమికులు ఏకాంతం కోసం ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లిన సమయంలో జరిగిన విషయాలే కథ. అయితే వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తిగా అనిపిస్తాయి. ప్రేమ అంటే పంచభూతాలు, విశ్వ విజేత.. అంటూ కబుర్లు చెప్పే ప్రేమికుడు సామాజిక భయానికి ఎంతగా తలవంచుతాడో, ఎంతగా గిలగిలలాడతాడో చూపించిన తీరు బాగుంది. అదే సమయంలో స్త్రీ స్వేచ్ఛగా, ధైర్యంగా తనకేం కావాలో, ప్రియుడి నుంచి ఏం కోరుతుందో అడిగి మరీ చూపించడం బాగుంది. ఈ కథలో అమ్మాయి పాత్ర రెబెల్‌గా ప్రవర్తించినట్టు కనిపిస్తున్నా, చాలా Practicalగా(తనేంటి, తనకేం కావాలి) బిహేవ్ చేసినట్టు నాకనిపించింది. ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానమైనా, ఒక భిన్న పరిణామాన్ని ఆమె తీసుకున్నంత ధైర్యంగా అతను తీసుకోలేడన్న విషయాన్ని తేటతెల్లం చేసిన కథ ఇది.
* సావిత్రి
రచయిత సంతోష్ ఎచిక్కనమ్ రాసిన కథ ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఆయనే దీనికి దర్శకుడు. 50 ఏళ్ల సంతోష్ మలయాళంలో ప్రసిద్ధ రచయిత. 2008లో 'కోమల' అనే కథ రాసి కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయితలు దర్శకులుగా మారినప్పుడు ఎంత Sensible కథలు తెరపైకి వస్తాయో చెప్పేందుకు ఈ చిత్రం తాజా ఉదాహరణ. కమ్యూనిస్టు, నక్సలైట్‌, మావోయిస్టులకూ తేడా తెలియనితనంతో మనం ఉంటే, కేరళవాళ్లు తమ చరిత్రలోని Communism అంశాన్ని తీసుకుని కథ రాసి, సినిమా తీశారు.
ఉద్యమాల్లో ఉండే స్త్రీల తెగింపు, తెగువ, ధైర్యం గురించి ఈ కథ ప్రస్తావిస్తూ సాగుతుంది‌. ప్రమాదకర సమయాల్లో తనను తాను రక్షించుకుంటూ సాగుతున్న మహిళ నేపథ్యం ఈ కథలో కీలకాంశం. కామ్రేడ్ సావిత్రి పాత్రలో నటి సంయుక్త మీనన్ నటన చాలా బాగుంది. ఏ స్త్రీకైనా బతుకుంతా పురుషులతో చేయాల్సింది పోరాటమే అన్నట్టు కథ ముగించడం బాగుంది. ఎటొచ్చీ కమ్యూనిస్టు స్త్రీ కార్యకర్త తన రహస్యం బయటకు తెలియకుండా ఉండేందుకు, తన శరీరాన్ని మరో వ్యక్తికి పంచడం అన్నది కొంచెం మింగుడు పడలేదు. అంత నిస్సహాయత వెనకాలున్న కారణం పేలవంగా మిగిలింది. జరిగిన సంఘటన ఆధారంగా రాసిన కథ అని ముందుగానే చెప్పడం వల్ల ఎటువంటి అభ్యంతరం చెప్పలేం!
* రాచియమ్మ
మూడు కథల్లో నాకు చాలా నచ్చిన కథ ఇది. ఇలాంటి అంశం కథవడం బాగుంది. స్త్రీ పురుషుడిపైన ప్రేమ చూపించడాన్ని పురుషుడు ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ప్రతిఫలంగా ఆమెకు ఏమివ్వాలి? ఈ రెండు అంశాలే ఈ కథ. ఏమీ ఇవ్వలేనంత నిస్సహాయతే అతని సమాధానం అని చెప్పకనే చెప్పడం ఈ కథ ముగింపు. మలయాళ తొలి సాహితీకారుల్లో ఒకరైన పరుతొల్లి చలప్పురత్తు కుట్టి కృష్ణన్(కలం పేరు 'ఉరూబ్') రాసిన 'రాచియమ్మ' కథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. 1969లో రాసిన కథలో స్త్రీ పాత్రను ఇంత అద్భుతంగా రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

స్త్రీ ఎవరి మీద ఏ క్షణాన ఎందుకు ప్రేమ చూపుతుందో ఆమె మనసుకు తెలుసు. దాన్ని అర్థం చేసుకుని ఆమెకు తోడుగా నిలిచే పురుషుడే ఆమెకు ముఖ్యం. అలా కాకుండా, తనకున్న భయాలు, ఇబ్బందులతో వెళ్లిపోయే పురుషుడి కోసం ఆమె దుఃఖించదు. తాపీగా తన బతుకు తాను బతుకుతుంది. ఏదో ఒకరోజు అతనే తిరిగి వస్తాడని ధైర్యం చెప్పుకుంటుంది. ఇది జగమెరగాల్సిన సత్యం. కొండంత ఆమె ప్రేమ, ధైర్యాలకు పురుషుడు ఏమివ్వగలడు? ఏం అందివ్వగలడు? వాహ్! ఇదీ కథంటే! నటీనటులు పార్వతి, ఆసిఫ్ అలీ చాలా సహజంగా నటించారు. కథ ప్రకారం (రాచియమ్మ మైసూర్‌‌వాసి కాబట్టి) మలయాళం సంభాషణలను ఒత్తొత్తి నిదానంగా పలికారు పార్వతి. అలా వినడం చాలా బాగుంది.
పీఎస్: మూడు కథలూ చూశాక నాకో విషయం అర్థమైంది. మరి ఎవరైనా గమనించారో, లేదో తెలియదు. 'రాణి' కథకు క్రైస్తవ పురాణాల్లోని 'Adam & Eve' కథతో పోలికుంది. 'సావిత్రి' కథ విరాటపర్వంలోని 'కీచకవధ'లా అనిపిస్తుంది. 'రాచియమ్మ' కథ శకుంతల, దుష్యంతుల కథలా తోస్తుంది. దర్శకులు కావాలనే ఇలా పురాణ కథల్ని పోలిన కథలు తీసుకున్నారా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా తెలియదు. Read: Tamil Movie Auditions
(సినిమా Amazon Primeలో లభ్యం)

No comments:

Post a Comment

Abhiyum Anuvum Full Movie Explained in Telugu

  ఇది ద్విభాషా చిత్రం. మలయాళంలో Abhiyude Katha Anuvinteyum అన్న పేరుతో విడుదలైంది. తమిళంలో మలయాళ నటుడు టోవినో థామస్ కి మొదటి సినిమా ! కొన్ని...